Wednesday 19 June 2013

||కాసిన్ని కబుర్లు.. కవిత్వంతో..||

చేతిలో చెయ్యేసి నడుస్తున్నాం ఇద్దరం
వొకరినొకరం తెరమీద హత్తుకోనందుకు..
మనసుల్లోనైనా తిట్టుకోనందుకు
వివాదాస్పదం కాలేదింకా
ప్రశాంతంగా సాగిపోతున్నాం..
కవిత్వానికీ నాకు దోస్తీ కదా..
ఆ చనువుతోనే అడిగా ఈరోజు..
ఈ రోజు నిన్నెలా అలంకరించను!!
ఆధునికంగానా!.. సనాతనంగానా!!
అన్నది కదా!..’”ఎందుకీ మీమాంస
నన్ను నగ్నంగానే ఉంచు’”…
మరో అనుమానం ..’మరి రౌడీ మూకలు వెంటపడవా!’
కవిత్వం.. అంది…. నవ్వుతూ ..
” …..ఎలా కనిపిస్తున్నాను నీకు!!
నీకు లీలగానే నా రూపం తెలుసు..
నిజం నా సహచరుడవ్వాలని
నిష్టూరాలు వేధిస్తూ ఉన్నా..
నిన్నే పట్టుకుని ఉన్నా..
మధూన్మత్తతలో నన్ను మధువుననుకోకు
వేదనా భావనలో అగాధమనుకోకు
మన మధ్య దూరమెంత!!
అనుగ్రహమున్నంతవరకే శూన్యం
నేనాగ్రహిస్తే.. అనంతం
దూరమయ్యాకా..
ఎన్నిరాగాలను వినగలవ్! నా పాటకోసం!!
ఏమి వెచ్చించి కొనగలవ్! చేజారాకా!!
జీవన పతంగ సూత్రం!!
విశ్వశేయమే నీ ఆదర్శమైనప్పుడు..
నీకు నేను తోడుంటాను
ఆనాడూ మంచిని పంచమని తప్ప..
నన్నలంకరించమని అడుగను
అక్షరానివి నువ్వైతే..
నిన్నావరించుకుని నేనుంటా..
అక్షరమే నన్ననుకున్నవారంతా..
ననులోకంపైకి వెదజల్లామనుకున్న వాళ్ళంతా..
నను వదిలేస్తున్న వివరాన్ని గమనించరు..
అలంకారాలు ఏమిచేస్తావు నాకు నేనే వెలుగైనప్పుడు
భాషను, వేషాన్ని ఏమి మారుస్తావు.. నీకు నేను తెలుగై నప్పుడు
ఆధునికానంతర అవతారం నాకు లేదు..
నవ్వులు పంచుతూ, కన్నీరు తుడుస్తూ నాతో నడు.. చాలు..”
ఇంకేం మాట్లాడతాను ..!! నేను !!!
Please Visit    http://blaagu.com/sateesh/

No comments:

Post a Comment